ఎలా ముగిస్తారో

సిరీస్‌ ఫలితం ఎలా వచ్చినప్పటికీ విజయం మాత్రం భారత్‌దే’’.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో టీమ్‌ఇండియా పోరాట పటిమ చూసిన తర్వాత చాలా మంది మాజీ ఆటగాళ్లు వ్యక్తపరిచిన అభిప్రాయమిది. అవును..   బలమైన ఆసీస్‌తో టెస్టుల్లో భారత ఆటగాళ్లు చూపిస్తున్న పోరాటం అసమానం. గాయాల కారణంగా ప్రధాన ఆటగాళ్లు దూరమైనప్పటికీ.. ద్వితీయ శ్రేణి క్రికెటర్లతో కూడిన జట్టు ప్రదర్శిస్తున్న పట్టుదల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ పోరాటానికి సరైన ఫలితం దక్కేందుకు టీమ్‌ఇండియాకు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. చివరి టెస్టు ఆఖరి రోజు అదే తెగువ, పట్టుదల చూపి సిరీస్‌ను సగర్వంగా ముగించాలని జట్టు కోరుకుంటోంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా భారత్‌కు కలిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే సిరీస్‌ 1-1తో సమంగా ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా.. చివరగా బోర్డర్‌-గావస్కర్‌ (2018-19)  సిరీస్‌లో విజేతగా నిలిచిన భారత్‌ దగ్గరే ఆ ట్రోఫీ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌ నెగ్గకపోతే మాత్రం ఆసీస్‌ పరువు కచ్చితంగా పోతుంది. ఎందుకంటే గత 31 టెస్టుల్లో తమకు పరాజయం తెలీని గబ్బా మైదానంలో.. అత్యుత్తమ ఎలెవన్‌ అందుబాటులో లేని భారత్‌తో  తలపడుతోన్న ఆ జట్టు డ్రా చేసుకున్నా అది ఓటమితో సమానమే. ఈ   నేపథ్యంలో సిరీస్‌లో మిగిలి ఉన్న ఈ ఒక్క రోజు ఆటలో భారత్‌ అదే పోరాటం కొనసాగిస్తే పర్యటనలో మనదే పైచేయి అవుతుంది. ఈ     పర్యటనలో ఆతిథ్య జట్టు వన్డే సిరీస్‌ నెగ్గగా.. టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ మ్యాచ్‌ డ్రా చేసుకుంటే టెస్టు సిరీస్‌నూ సమం చేసిన సంతృప్తితో భారత్‌కు స్వదేశం బయల్దేరుతుంది.
ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా డ్రాగా ముగిస్తే అది 2018-19 సిరీస్‌ ఓటమి కంటే కూడా ఘోరమైన పరాజయంగా మిగిలిపోతుంది. సిరీస్‌లో భారత్‌ 20 మంది ఆటగాళ్లను ఆడించాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు ఆసీస్‌ జట్టులోకి వార్నర్‌ తిరిగి వచ్చాడు. గత సిరీస్‌లో లేని స్మిత్‌ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను డ్రాగా ముగిస్తే నా దృష్టిలో అది చెత్త ఓటమి కిందే లెక్క. చివరి మ్యాచ్‌లో విజయం కోసం ఆసీస్‌ తీవ్రంగా కృషి చేయాలి.

ఈ మ్యాచ్‌ ఇప్పటికీ మా చేతుల్లోనే ఉంది. పిచ్‌ జిమ్మిక్కులు చేయడం మొదలెట్టింది. కొన్ని బంతులు ఎక్కువగా బౌన్స్‌ అవుతున్నాయి. చివరి రోజు ఆటలో మంచి ప్రదేశాల్లో బంతులేస్తూ.. పిచ్‌ స్పందనపై ఆధారపడడమే మా పని. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఓపికతో ఉండాలి. మంగళవారం ఆట చాలా ఆసక్తిగా ఉండబోతుంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న స్టార్క్‌ చివరి రోజు బౌలింగ్‌ చేస్తాడనే నమ్మకంతో ఉన్నా’

-స్టీవ్‌ స్మిత్‌

చివరి టెస్టులో టీమ్‌ఇండియా పోరాటానికి వరుణుడు కూడా మద్దతుగా నిలిచేలా కనిపిస్తున్నాడు. నాలుగో రోజు ఆటలో దాదాపు చివరి సెషన్‌ జరగకుండా అడ్డుపడిన వర్షం.. ఆఖరి రోజు ఆటలో కూడా మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఆ వరుణుడి రాక భారత్‌కు మేలు చేసేదే! రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటవడంతో.. భారత్‌ ముందు 328 పరుగుల లక్ష్యం నిలిచింది. మ్యాచ్‌ చివరి ఇన్నింగ్స్‌లో.. అస్థిరమైన బౌన్స్‌కు సహకరిస్తున్న పిచ్‌పై అంతటి లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించడం దాదాపు అసాధ్యమే! మరోవైపు పటిష్ఠమైన ఆసీస్‌ పేసర్లను కాచుకుని ఆఖరి రోజంతా బ్యాటింగ్‌ చేయడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో సోమవారం మరో 25 ఓవర్ల ఆట సాధ్యమవుతుందనే పరిస్థితుల్లో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఓపెనర్లు వికెట్‌ కోల్పోకుండా రోజు ముగిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు. కానీ రెండు ఓవర్లు కూడా పూర్తి కాకముందే వరుణుడు మళ్లీ వచ్చేశాడు. దీంతో ఆట ఆగిపోయింది. మంగళవారం కూడా వర్షం వస్తే.. భారత్‌ 98 ఓవర్ల పాటు వికెట్లు కాచుకోవాల్సిన అవసరం లేకుండానే మ్యాచ్‌ డ్రాగా ముగిసే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసీస్‌ పేసర్‌ స్టార్క్‌ తొడ కండరాల గాయంతో బాధపడుతుండటం కూడా కలిసొచ్చేదే. నాలుగో రోజు ఒక్క ఓవర్‌ వేసిన అతను బౌలింగ్‌ చేసేందుకు ఇబ్బంది పడ్డాడు.



Comments

Popular posts from this blog

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం