గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?


సిడ్నీ: ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరి 5న ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపికకు వేళైంది. మంగళవారం కొత్త ఛైర్మన్‌ చేతన్‌శర్మ సారథ్యంలో జరిగే సెలక్షన్‌ కమిటీ సమావేశంలో జట్టును ప్రకటించనున్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు భారత బృందాన్ని ఎంపిక చేయనున్నారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ముగిశాక పితృత్వ సెలవుపై స్వదేశానికి వచ్చేసిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో తిరిగి పగ్గాలు చేపట్టనున్నాడు. గాయం కారణంగా ఆసీస్‌ వెళ్లలేకపోయిన వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌శర్మ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆడుతున్న ఇషాంత్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు. అతనితో పాటు ఆసీస్‌ సిరీస్‌లో గాయపడి కోలుకున్న బుమ్రా, అశ్విన్‌ తిరిగి జట్టులోకి రానున్నారు. గాయాలతో కంగారూలతో టెస్టు సిరీస్‌ మధ్యలో వైదొలిగిన షమి, జడేజా, ఉమేశ్‌ యాదవ్‌, హనుమ విహారి సెలక్షన్‌కు అందుబాటులో లేరు. శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌లను రిజర్వ్‌ పేసర్లుగా ఎంపిక చేసే అవకాశాలున్నాయి. జడేజాకు బదులు షాబాజ్‌ నదీమ్‌ను జట్టులోకి తీసుకు రావచ్చు. మిడిలార్డర్‌లో స్థానం కోసం కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ మధ్య పోటీ ఉంది. ఆసీస్‌ సిరీస్‌లో విఫలమైన పృథ్వీ షాను జట్టు నుంచి తప్పించే అవకాశాలున్నాయి. టీమ్‌ఇండియా ఈనెల 27న తొలి రెండు టెస్టులు జరిగే చెన్నైలో బయో బుడగలో ప్రవేశించనుంది.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం