ఆసీస్‌పై 100 సిక్సర్లు బాదిన ఒకేఒక్కడు

టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్‌గా అవతరించాడు. ఆ జట్టుపై మరెవ్వరికీ లేని ఘనత సొంతం చేసుకున్నాడు. కెరీర్లో 424వ సిక్సర్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ 77 బంతుల్లో 1 సిక్సర్‌, 3 బౌండరీల సాయంతో 26 పరుగులు చేశాడు. నేథన్‌ లైయన్‌ వేసిన 16వ ఓవర్లో అద్భుతమైన సిక్సర్ బాదాడు. క్రీజును దాటి చక్కని ఫుట్‌వర్క్‌తో బంతిని బౌండరీ ఆవలకు పంపించి ఆసీస్‌పై 100 సిక్సర్ల రికార్డు అందుకున్నాడు. ఒక జట్టుపై అన్ని ఫార్మాట్లలో కలిపి ఎక్కువ సిక్సర్లు బాదిన వారిలో క్రిస్‌గేల్‌దే అగ్రస్థానం. అతడు ఇంగ్లాండ్‌పై ఏకంగా 140 సిక్సర్లు దంచేశాడు.

మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్‌ 424వ సిక్స్ బాదేశాడు. క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదినవారి జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. క్రిస్‌గేల్‌ (534), షాహిద్‌ అఫ్రిది (476) అతడి కన్నా ముందున్నారు. అయితే ఇందుకోసం వీళ్లు 500కు పైగా ఇన్నింగ్స్‌లు ఆడారు. హిట్‌మ్యాన్‌ మాత్రం 370 ఇన్నింగ్సుల్లోనే 420 సిక్సర్ల మైలురాయిని దాటేశాడు. ఇక మెక్‌ కలమ్‌ (398), ఎంఎస్‌ ధోనీ (359), సనత్‌ జయసూర్య (352), ఇయాన్‌ మోర్గాన్‌ (337), ఏబీ డివిలియర్స్‌ (328), మార్టిన్‌ గప్తిల్‌ (323).. రోహిత్‌ తర్వాతి స్థానంలో ఉన్నారు.


Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం