టీమ్‌ఇండియా గెలవాలంటే 309 కొట్టాలి

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్‌ఇండియా గెలవాలంటే సోమవారం చివరి రోజు 309 పరుగులు చెయ్యాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(9), రహానె(4) ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 (తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 94 కలిపి) పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓపెనర్లు.. రోహిత్‌ శర్మ(52; 98 బంతుల్లో 5x4, 1x6), శుభ్‌మన్‌గిల్‌(31; 64 బంతుల్లో 4x4) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు.

ఈ క్రమంలోనే హేజిల్‌వుడ్‌ వేసిన 23వ ఓవర్‌లో గిల్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై పుజారాతో కలిసి బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ అర్ధశతకం సాధించాడు. 30వ ఓవర్‌లో లైయన్‌ బౌలింగ్‌లో బౌండరీ బాదిన హిట్‌మ్యాన్‌ విదేశాల్లో టెస్టు ఓపెనర్‌గా తొలి అర్ధశతకం నమోదు చేశాడు. ఇక తర్వాతి ఓవర్‌లోనే కమిన్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్‌ వద్ద స్టార్క్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అప్పటికి స్కోర్‌ 92/2గా నమోదైంది. తర్వాత నిలకడగా ఆడిన పుజారా, రహానె మరో వికెట్‌ పడకుండా నాలుగో రోజు ఆటను పూర్తి చేశారు. అంతకుముందు ఆస్ట్రేలియా 312/6 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేసింది.

రాణించిన లబుషేన్‌, స్మిత్‌, గ్రీన్‌..
ఆదివారం ఉదయం 103/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండు సెషన్లు బ్యాటింగ్‌ చేసింది. తొలి సెషన్‌లో 79 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు రెండో సెషన్‌లోనూ మరో రెండు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలోనే లబుషేన్‌(73; 118 బంతుల్లో 9x4), స్మిత్‌(81; 167 బంతుల్లో 8x4, 1x6) గ్రీన్‌(84; 132 బంతుల్లో 8x4, 4x6) అర్ధశతకాలతో రాణించారు. చివర్లో కెప్టెన్‌ టిమ్‌పైన్‌(39*; 52 బంతుల్లో 6x4) ధాటిగా ఆడి ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో సైని, అశ్విన్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, సిరాజ్‌ చెరో వికెట్‌ తీశారు.

స్కోర్‌ బోర్డు:

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 338 ఆలౌట్‌; స్మిత్‌ 131, లబుషేన్‌ 91

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 244 ఆలౌట్‌; గిల్‌ 50, పుజారా 50

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 312/6 డిక్లేర్డ్‌; గ్రీన్‌ 84, స్మిత్‌ 81

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 98/2; రోహిత్‌ 52, గిల్ 31 (నాలుగో రోజు)

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం