అశ్విన్ ఒక్కడే 800 వికెట్లు తీస్తాడు
‘అశ్విన్ ఒక్కడే 800 వికెట్లు తీసే అవకాశం ఉంది. ఎందుకంటే అతనో గొప్ప స్పిన్నర్. ఇది పక్కనపెడితే, మరే బౌలర్ కూడా ఆ మార్కును అందుకోలేడు. లైయన్ కూడా ఆ రికార్డును చేరుకునేంత గొప్పగా లేడు. అతనిప్పుడు 396 వికెట్లతో కొనసాగుతున్నాడు. 800 వికెట్లు తీయాలంటే చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది’ అని మురళీధరన్ రాసుకొచ్చాడు. టీ20, వన్డే మ్యాచ్‌లు టెస్టు క్రికెట్ పరిస్థితుల్ని మార్చాయని చెప్పాడు. అలాగే తాను ఆడే రోజుల్లో టెక్నికల్‌గా బ్యాట్స్‌మెన్ ఎంతో బాగా ఆడేవారని, అప్పుడు వికెట్లు కూడా ఫ్లాట్‌గా ఉండేవని చెప్పాడు.
ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే పూర్తవుతున్నాయని, అప్పట్లో వికెట్లు తీయాలంటే బౌలర్లు చాలా కష్టపడేవారని చెప్పాడు. అందుకోసం వైవిధ్యమైన బంతులు ప్రయత్నించేవారన్నాడు. ఇక ఇప్పుడు సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే వికెట్లు వాటంతట అవే వస్తాయన్నాడు. ఇప్పుడు బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు అటాకింగ్ చేయకుండా ఉండలేరని, దాంతో వికెట్లు తీయడం సులువగా మారిందని స్పిన్ దిగ్గజం అభిప్రాయపడ్డాడు. తాను ఆడే రోజుల్లో డీఆర్‌ఎస్ ఉండి ఉంటే తన వికెట్ల సంఖ్య 800 కన్నా ఎక్కువే ఉండేదని మురళీ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, అశ్విన్ ప్రస్తుతం 74 టెస్టుల్లో 377 వికెట్లతో కొనసాగుతున్నాడు. మరోవైపు ఆసీస్ స్పిన్నర్ లైయన్ 99 టెస్టుల్లో 396 వికెట్లు తీశాడు. ఇక శుక్రవారం నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారో వేచిచూడాలి.
Comments
Post a Comment