నాన్న గుర్తొచ్చే.. సిరాజ్‌ కంటతడి

జాతీయగీతం ఆలపించేటప్పుడు నాన్న గుర్తొచ్చాడని టీమ్‌ఇండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. అందుకే కాస్త భావోద్వేగానికి గురయ్యానని తెలిపాడు. తాను దేశం తరఫున టెస్టు క్రికెట్‌ ఆడాలన్నది నాన్న కలని  పేర్కొన్నాడు. ‘ఇప్పుడు నాన్న నన్ను చూస్తున్నారనే అనుకుంటున్నా’ అని వెల్లడించాడు. మూడో టెస్టు తొలిరోజు తర్వాత సిరాజ్‌ మీడియాతో మాట్లాడాడు.

నవంబర్లో సిరాజ్‌ తండ్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. కరోనా ఆంక్షలు, దేశం తరఫున ఆడాలన్న తండ్రి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో సిరాజ్‌ నగరానికి రాలేకపోయాడు. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనలేదు. కాగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో అరంగేట్రం చేసిన సిరాజ్‌ చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. సమయోచితంగా వికెట్లు తీసి జట్టుకు అండగా నిలుస్తున్నాడు. సిడ్నీ టెస్టులోనూ ఆసీస్‌ తొలి వికెట్‌ను సిరాజే అందించాడు. ప్రమాదకర డేవిడ్‌ వార్నర్‌ను పెవిలియన్‌ పంపించాడు. సిడ్నీ పిచ్‌ బ్యాటర్లకు స్వర్గధామంగా ఉందని, స్పిన్నర్లకూ అనుకూలిస్తుందని సిరాజ్‌ అంటున్నాడు.

‘ఇది ఫ్లాట్‌ వికెట్‌. పరుగులు చేయడం సులభం కాబట్టి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాలన్నదే మా ప్రణాళిక. గత మ్యాచుల్లో మాదిరిగా బౌన్సర్లూ ప్రభావం చూపడం లేదు. ఏదేమైనా టెస్టు క్రికెట్‌ అంటే ఓపిక అన్నది గుర్తుంచుకోవాలి. పిచ్‌ కఠినంగా లేకపోవడంతో బ్యాట్స్‌మెన్‌ ముందుకొచ్చి మరీ ఆడుతున్నారు. ఎప్పుడైనా బంతి చురుగ్గా టర్న్‌ అవుతుందని గ్రహించారో క్రీజు వదలకుండా ఆడటం మొదలుపెట్టారు’ అని సిరాజ్‌ అన్నాడు.

‘రెండో రోజు ఎలా ఉంటుందో చూడాలి. కఠినమైన లైన్‌ అండ్‌ లెంగ్తుల్లో బంతులేసి ఒత్తిడి పెంచడం పైనే మా దృష్టి. సన్నాహక మ్యాచుల్లో విల్‌ పకోస్కీ షార్ట్‌పిచ్‌ బంతులు ఆడటం గమనించాం. అందుకే కట్టుదాటకుండా బౌన్సర్లతో ఆశ్చర్యపరచాలనుకున్నాం. సైని నేను భారత్‌-ఏ తరఫున కలిసి ఆడాం. మా మధ్య మంచి అనుబంధం ఉంది. కీపర్‌ క్యాచులు వదిలేస్తే బాధగానే ఉంటుంది. కానీ దాంతో ఏకాగ్రత కోల్పోకుండా తర్వాత ఓవర్‌ వేయడం ముఖ్యం’ అని సిరాజ్‌ పేర్కొన్నాడు.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం