క్రికెటెప్పుడూ వివక్ష చూపదు: సచిన్‌

ముంబయి: ఆటలనేవి అందర్నీ కలుపుతాయని, మనుషుల్ని విడదీయవని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వరుసగా రెండు రోజుల్లో రెండు సార్లు జాత్యహంకార వ్యాఖ్యలకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు టీమ్‌ఇండియా మాజీ ఆటగాళ్లు స్పందించారు. జాతి వివక్ష అంశాల పట్ల కఠినంగా ఉండాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే సచిన్‌ గతరాత్రి సామాజిక మాధ్యమాల్లో స్పందించాడు. 

క్రికెట్‌ అనేది ఎప్పుడూ వివక్ష చూపదని చెప్పాడు. ఇది కేవలం.. బ్యాట్‌, బంతి పట్టుకున్న ఆటగాళ్ల ప్రతిభ మాత్రమే చూస్తుందని తెలిపాడు. ఇందులో ఆటగాళ్ల జాతి, రంగు, మతంతో సంబంధం లేదన్నాడు. ఈ విషయం అర్థం చేసుకోని వారికి క్రీడా రంగంలో కొనసాగే అర్హత లేదని అసహనం వ్యక్తం చేశాడు. అంతకుముందు సెహ్వాగ్‌ సైతం ఇలాగే స్పందించాడు. ‘మీరు చేస్తే వెటకారం, ఇతరులు చేస్తే జాతి వివక్ష. సిడ్నీ టెస్టులో పలువురు ఆస్ట్రేలియా ప్రేక్షకులు చేసింది దురదృష్టకరం’ అని ట్వీట్‌ చేశాడు. 

అలాగే వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందిస్తూ తాను కూడా ఆస్ట్రేలియాలో ఆడేటప్పుడు చాలాసార్లు జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియా ప్రేక్షకులు ఇలా చేయడం ఇదే తొలిసారి కాదని, వాటిని ఎలా అరికడతారని ప్రశ్నించాడు. ఇదిలా ఉండగా, శనివారం సిరాజ్‌ను దూషించిన పలువురు వీక్షకులను మైదానం నుంచి పంపించారు. అనంతరం పోలీసులు వారిని విచారించారని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అలాగే టీమ్‌ఇండియాను క్షమాపణలు కోరింది.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం