బ్రిస్బేన్‌లో లాక్‌డౌన్‌.. నాలుగో టెస్టు జరిగేనా?

బ్రిస్బేన్‌లో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. క్వీన్స్‌లాండ్‌ ప్రభుత్వం తాజాగా మూడు రోజుల లాక్‌డౌన్‌ విధించడమే అందుకు కారణం. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 15 నుంచి 19 వరకు బ్రిస్బేన్‌లోని గబ్బాలో నాలుగో టెస్టు జరగాలి. అయితే కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా అక్కడి ప్రభుత్వం కఠినమైన క్వారంటైన్‌ నిబంధనల్ని అమలు చేస్తోంది. మరోసారి కఠిన క్వారంటైన్‌ నిబంధనల్ని పాటించడం సాధ్యంకాదని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు బీసీసీఐ తేల్చిచెప్పింది. నిబంధనలు సడలించకపోతే బ్రిస్బేన్‌కు వెళ్లమని స్పష్టంచేసింది. ఈ వ్యవహారంపై బీసీసీఐ, సీఏల మధ్య చర్చలు ప్రారంభమైన 24 గంటల్లోనే అక్కడి ప్రభుత్వం మూడు రోజుల లాక్‌డౌన్‌ విధించడం క్రికెట్‌ ఆస్ట్రేలియాను మరింత సందిగ్ధంలోకి నెట్టింది. ‘‘బ్రిస్బేన్‌ టెస్టుపై మూడు రోజుల లాక్‌డౌన్‌ ప్రభావంపై సీఏ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇప్పటికే కఠినమైన బయో భద్రత ఆంక్షల నేపథ్యంలో బ్రిస్బేన్‌కు వెళ్లేందుకు టీమ్‌ఇండియా ఆసక్తి చూపించట్లేదు. హోటల్‌ సిబ్బందిలో ఒకరికి యూకే స్ట్రెయిన్‌ కొవిడ్‌ సోకిందన్న సమాచారం.. టెస్టు మ్యాచ్‌ను గబ్బాలోనే నిర్వహించాలని భావిస్తోన్న సీఏ ప్రయత్నాలను మరింత ఇబ్బందికరంగా మార్చేసింది’’ అని క్రికెట్‌ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఆటగాళ్లు బ్రిస్బేన్‌కు వెళితే కేవలం హోటల్‌, మైదానానికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే హోటల్లో ఆటగాళ్లందరూ కలిసి భోజనం చేసేందుకు, జట్టు సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ కోరింది. అందుకు సీఏ సరే అన్నప్పటికీ.. రాత పూర్వకంగా సమాధానమివ్వాలని బీసీసీఐ అడుగుతున్నట్లు సమాచారం. బ్రిస్బేన్‌లో టెస్టు మ్యాచ్‌ నిర్వహణ సాధ్యంకాకపోతే ప్రత్యామ్నాయ వేదికగా సిడ్నీని ఎంపిక చేశారు.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం