కోహ్లీ, పాండ్య ఆంక్షల ఉల్లంఘన అబద్ధం
టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కొవిడ్-19 ఆంక్షలను ఉల్లంఘించడం శుద్ధ అబద్ధమని సిడ్నీలోని బేబీ స్టోర్ యజమాని నేథన్ పొంగ్రాస్ తెలిపారు. ఆస్ట్రేలియాలోని ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. స్టోర్‌కు వచ్చిన వారిద్దరికీ బహుమతులు ఇవ్వాలనుకున్నా వాటికి వారు డబ్బులు చెల్లించారని వెల్లడించారు. తమ ఉద్యోగుల కోరిక మేరకు ఎంతో ఓపికగా ఫొటోలు దిగారని ప్రశంసించారు. వారిద్దరినీ అసలు స్పర్శించనివ్వలేదని స్పష్టం చేశారు. వారు స్టోర్‌కు వచ్చినప్పుడు ఆంక్షలే లేవని నొక్కిచెప్పడం గమనార్హం.
సిడ్నీలో ఉండగా కోహ్లీ, పాండ్య కలిసి ఓ బేబీస్టోర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వారు మాస్కుల్లేకుండా చిత్రాలు దిగారు. డిసెంబర్ 7న వారు స్టోర్‌కు వెళితే దాదాపుగా 20 రోజులు తర్వాత ఆ చిత్రాలు వైరల్‌గా మారాయి. దాంతో వారు కొవిడ్-19 ఆంక్షలు, బయో బుడగ నిబంధనలు ఉల్లంఘించారని ఆసీస్ మీడియా ప్రచారం చేసింది. అంతకుముందే రోహిత్ సహా ఐదుగురు హోటల్‌కు వెళ్లిన వీడియోలను చూపించి దుష్ప్రచారం చేసింది. ఆ తర్వాత గబ్బాలో నాలుగో టెస్టు బహిష్కరణ, బీసీసీఐ ఆగ్రహం, ఆటగాళ్ల అసంతృప్తి వంటి వార్తలు షికారు చేశాయి.
తాజాగా కోహ్లీ, పాండ్యతో చిత్రాలు దిగడంపై బేబీ స్టోర్ యజమాని నేథన్ పొంగ్రాస్ స్వయంగా స్పందించడం గమనార్హం. ఆసీస్ మీడియా వార్తలు అబద్ధమని ఆమె కొట్టిపారేశారు. ‘వారు మా స్టోర్‌కు వచ్చి కొంత సమయం గడిపారు. ఆ దశలో న్యూసౌత్ వేల్స్‌లో అసలు ఆంక్షలే లేవు. మేం కోహ్లీ, పాండ్యకు బహుమతులు ఇవ్వాలనుకున్నాం. కానీ వారు అన్నింటికీ బిల్లు చెల్లించారు. వారు అత్యంత ఉదారంగా మాతో సమయం గడిపారు. మా ఉద్యోగులతో మాట్లాడారు. మా కుటుంబ సభ్యులతో ఈ అనుభవం పంచుకోవాలనే ఉద్దేశంతోనే వారితో ఫొటోలు దిగాం. వారు మా స్టోర్‌కు వచ్చారని గర్వంగా చెప్పుకొనేందుకే సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టాం. కానీ వాటితో మీడియా ఇలా చేయడం సిగ్గుచేటు’ అని పొంగ్రాస్ అన్నారు.
Comments
Post a Comment