Posts

Showing posts from January, 2021

భారత్‌ అద్భుత విజయం

Image
టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో సారి ట్రోఫీ గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంత్‌ (89*), సుందర్‌(22) చివర్లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 369 ఆలౌట్‌ భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 336 ఆలౌట్‌ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 294 ఆలౌట్‌ భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 329/7

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

Image
సిడ్నీ: ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరి 5న ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపికకు వేళైంది. మంగళవారం కొత్త ఛైర్మన్‌ చేతన్‌శర్మ సారథ్యంలో జరిగే సెలక్షన్‌ కమిటీ సమావేశంలో జట్టును ప్రకటించనున్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు భారత బృందాన్ని ఎంపిక చేయనున్నారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ముగిశాక పితృత్వ సెలవుపై స్వదేశానికి వచ్చేసిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో తిరిగి పగ్గాలు చేపట్టనున్నాడు. గాయం కారణంగా ఆసీస్‌ వెళ్లలేకపోయిన వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌శర్మ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆడుతున్న ఇషాంత్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు. అతనితో పాటు ఆసీస్‌ సిరీస్‌లో గాయపడి కోలుకున్న బుమ్రా, అశ్విన్‌ తిరిగి జట్టులోకి రానున్నారు. గాయాలతో కంగారూలతో టెస్టు సిరీస్‌ మధ్యలో వైదొలిగిన షమి, జడేజా, ఉమేశ్‌ యాదవ్‌, హనుమ విహారి సెలక్షన్‌కు అందుబాటులో లేరు. శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌లను రిజర్వ్‌ పేసర్లుగా ఎంపిక చేసే అవకాశాలున్నాయి. జడేజాకు బదులు షాబాజ్‌ నదీమ్‌ను జట్టులోకి తీసుకు రావచ్చు. మిడిలార్డర్‌లో స్థానం కోసం కేఎ...

కేటీఆర్‌తో సిడ్నీ హీరో

Image
టీమ్‌ఇండియా టెస్టు జట్టు ఆటగాడు గాదె హనుమ విహారి సోమవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కలిశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో మూడో టెస్టులో అద్భుత పోరాటంతో ప్రశంసలందుకున్న విహారి తొడ కండరాల గాయం కారణంగా చివరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అనంతరం స్వదేశానికి తిరిగొచ్చిన విహారి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. విహారితో పాటు భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు తరుణ్‌ కోన, శ్రీకృష్ణప్రియ, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. విహారి, తరుణ్‌, శ్రీకృష్ణప్రియలను సత్కరించిన కేటీఆర్‌.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

స్మిత్‌ చూస్తుండగానే రోహిత్‌ షాడో బ్యాటింగ్‌

Image
టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ గబ్బా పిచ్‌పై షాడో బ్యాటింగ్‌ చేశాడు. స్టీవ్‌స్మిత్‌ చూస్తుండగానే క్రీజులోకి వచ్చి ఫ్రంట్‌ఫుట్‌తో ఊహాత్మకంగా షాట్‌ ఆడాడు. ఆ తర్వాత నేరుగా అవతలి ఎండ్‌లోకి వెళ్లి స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేశాడు. ఉద్దేశపూర్వకంగా చేశాడో? ఊరికే చేశాడో? తెలియదు గానీ మొత్తానికి ఆ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. సిడ్నీలో టెస్టులో టీమ్‌ఇండియా వీరోచితంగా పోరాడిన సంగతి తెలిసిందే. ఆఖరి రోజు రిషభ్ పంత్‌ మెరుపులు మెరిపించాడు. అయితే విరామ సమయంలో స్టీవ్‌స్మిత్‌ క్రీజులోకి వచ్చి షాడో బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలో అతడు పంత్‌ బ్యాటింగ్‌ గార్డ్‌ చెరిపివేసినట్టు వీడియోల్లో కనిపించింది. అతడు ఉద్దేశపూర్వకంగానే పంత్‌ గార్డ్‌మార్క్‌ చెరిపివేశాడని విమర్శలు వచ్చాయి. ఆసీస్‌ క్రికెటర్లు అప్పుడు స్మిత్‌కు అండగా నిలిచారు.‌ అప్పుడప్పుడు క్రీజులోకి వచ్చి బ్యాటింగ్‌ చేస్తున్నట్టుగా ఊహించుకుంటాడని టిమ్‌పైన్‌ సహా మరికొందరు తెలిపారు. ఇప్పుడు స్టీవ్‌స్మిత్‌ బ్యాటింగ్‌ చేస్తుండగానే రోహిత్‌ అలా చేయడం విస్మయపరిచింది. దీనిపై మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మాట్లాడాడు. దురుద్దేశపూర్వకంగా స్టీవ్‌స్మిత్‌ పిచ్‌ను ...

ఎలా ముగిస్తారో

Image
సి రీస్‌ ఫలితం ఎలా వచ్చినప్పటికీ విజయం మాత్రం భారత్‌దే’’.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో టీమ్‌ఇండియా పోరాట పటిమ చూసిన తర్వాత చాలా మంది మాజీ ఆటగాళ్లు వ్యక్తపరిచిన అభిప్రాయమిది. అవును..   బలమైన ఆసీస్‌తో టెస్టుల్లో భారత ఆటగాళ్లు చూపిస్తున్న పోరాటం అసమానం. గాయాల కారణంగా ప్రధాన ఆటగాళ్లు దూరమైనప్పటికీ.. ద్వితీయ శ్రేణి క్రికెటర్లతో కూడిన జట్టు ప్రదర్శిస్తున్న పట్టుదల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ పోరాటానికి సరైన ఫలితం దక్కేందుకు టీమ్‌ఇండియాకు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. చివరి టెస్టు ఆఖరి రోజు అదే తెగువ, పట్టుదల చూపి సిరీస్‌ను సగర్వంగా ముగించాలని జట్టు కోరుకుంటోంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా భారత్‌కు కలిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే సిరీస్‌ 1-1తో సమంగా ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా.. చివరగా బోర్డర్‌-గావస్కర్‌ (2018-19)  సిరీస్‌లో విజేతగా నిలిచిన భారత్‌ దగ్గరే ఆ ట్రోఫీ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌ నెగ్గకపోతే మాత్రం ఆసీస్‌ పరువు కచ్చితంగా పోతుంది. ఎందుకంటే గత 31 టెస్టుల్లో తమకు పరాజయం తెలీని గబ్బా మైదానంలో.. అత్యుత్తమ ఎలెవన్‌ అందుబాటులో లేని భారత్‌తో ...

ఆఖరి పోరాటం

Image
జట్టు నిండా గాయాలే. 11 మంది ఫిట్‌గా ఉన్న వాళ్లను సిద్ధం చేయడమే కష్టం ఉంది. దానికి తోడు క్వారంటైన్‌ కష్టాలు. ఆపై ఆడాల్సింది ఆస్ట్రేలియాకు అద్బుత రికార్డున్న గబ్బాలో. ఇన్ని ప్రతికూలాంశాలున్నా.. టీమ్‌ ఇండియా ఆత్మవిశ్వాసంతో ఉంది. క్లిష్టపరిస్థితుల్లో సిడ్నీలో అసాధారణ పోరాటంతో చేసుకున్న డ్రా స్ఫూర్తినిస్తుంటే.. ఆతిథ్య జట్టుతో నిర్ణయాత్మక నాలుగో టెస్టుకు సన్నద్ధమైంది. రేపటి నుంచే సమరం. హో రాహోరీగా సాగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో రసవత్తర సమరానికి వేళైంది. శుక్రవారం నుంచే భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు. సిరీస్‌ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌పై చాలా ఆసక్తి ఏర్పడింది. గత మ్యాచ్‌ ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత్‌ బరిలోకి దిగుతుంటే.. తమకు గొప్ప రికార్డున్న గబ్బాలో మరోసారి తమదే పైచేయి అవుతుందన్న ధీమాతో ఆతిథ్య జట్టు పోరుకు సిద్ధమైంది.  మరి సిరీస్‌ ఎవరి సొంతమవుతుందో..! పొంచి ఉన్న వాన ఎం తో ఆసక్తిరేపుతున్న ఈ చివరి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం, సోమవారం వాన పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే వాన వల్ల రోజంతా ఆట ఏమీ తుడిచిపెట్టుకుపోవచ్చు. గబ్బా పిచ్‌పై బౌలర్లక...

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

Image
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టులో ఒక ఆటగాడికి యూకే కరోనా స్ట్రెయిన్‌ సోకిందని అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో అతడిని ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించామని చెప్పారు. లంక జట్టుతో ఇంగ్లాండ్‌ నేటి నుంచి రెండు టెస్టుల సిరీస్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కన్నా ముందే ఈ సిరీస్‌ జరగాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. క్రికెట్‌ మళ్లీ మొదలయ్యాక నేటి నుంచి నిర్వహించడానికి ఇరు జట్లూ అంగీకరించాయి. ఈ క్రమంలోనే జనవరి 4న అక్కడ అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు కరోనా టెస్టులు చేశారు.  అందులో ఆల్‌రౌండర్‌ మోయిన్‌ అలీకి పాజిటివ్‌గా తేలిందని, అది యూకే స్ట్రెయిన్‌గా గుర్తించామని లంక వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అయితే, శ్రీలంకలో ఇదే తొలి యూకే స్ట్రెయిన్‌ కేసు అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ వైరస్‌ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందన్న నేపథ్యంలో గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. అంతకుముందు మిగతా ఆటగాళ్లకి నెగెటివ్‌ రావడంతో నేటి నుంచి టెస్టు సిరీస్ యథావిధిగా కొనసాగుతందని చెప్పారు. మరోవైపు అలీతో సన్నిహితంగా ఉన్న క్రిస్‌వోక్స్‌కు నెగిటివ్‌ వచ్చిందని తెలిపారు. అయితే, వోక్స్‌ ...

అశ్విన్‌ ఒక్కడే 800 వికెట్లు తీస్తాడు

Image
 ప్రస్తుత స్పిన్నర్లలో టీమ్ఇండియా బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్వినే అత్యుత్తమ ఆటగాడని, అతనొక్కడే టెస్టుల్లో 700-800 వికెట్లు తీస్తాడని స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ అభిప్రాయపడ్డాడు. అలాగే ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ అన్ని వికెట్లు తీయలేడని చెప్పాడు. మురళీధరన్‌ తాజాగా టెలిగ్రాఫ్‌కు రాసిన ఓ కథనంలో ఈ వ్యాఖ్యలు చేశాడని పీటీఐ పేర్కొంది.  ‘అశ్విన్‌ ఒక్కడే 800 వికెట్లు తీసే అవకాశం ఉంది. ఎందుకంటే అతనో గొప్ప స్పిన్నర్‌‌. ఇది పక్కనపెడితే, మరే బౌలర్‌ కూడా ఆ మార్కును అందుకోలేడు. లైయన్‌ కూడా ఆ రికార్డును చేరుకునేంత గొప్పగా లేడు. అతనిప్పుడు 396 వికెట్లతో కొనసాగుతున్నాడు. 800 వికెట్లు తీయాలంటే చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది’ అని మురళీధరన్‌ రాసుకొచ్చాడు. టీ20, వన్డే మ్యాచ్‌లు టెస్టు క్రికెట్‌ పరిస్థితుల్ని మార్చాయని చెప్పాడు. అలాగే తాను ఆడే రోజుల్లో టెక్నికల్‌గా బ్యాట్స్‌మెన్‌ ఎంతో బాగా ఆడేవారని, అప్పుడు వికెట్లు కూడా ఫ్లాట్‌గా ఉండేవని చెప్పాడు.  ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే పూర్తవుతున్నాయని, అప్పట్లో వికెట్లు తీయాలంటే బౌలర్లు చాలా కష్టపడేవారని చెప్పాడు. అందుకోసం వైవి...

ఇది సిగ్గుచేటు: వివాదంపై స్పందించిన స్మిత్‌

Image
డ్రింక్స్‌ బ్రేక్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్ గార్డ్‌ మార్క్‌ను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్ చెరిపివేశాడని వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వక్రబుద్ధితో స్మిత్ అలా చేశాడని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై స్మిత్ స్పందించాడు. తనపై ఇలాంటి నిందలు రావడం ఎంతో బాధగా ఉందని అన్నాడు. ‘‘నాపై నిందలు రావడం ఆశ్చర్యంగా, బాధగా ఉంది. మా బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారు, వాటిని ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఎలా ఎదుర్కొంటున్నారని ఊహిస్తూ... క్రీజులో ‌గార్డు మార్క్‌ను చేసుకుని ఆలోచించడం నాకు అలవాటు. కానీ టీమిండియా ఆఖరి రోజు చేసిన అద్భుత పోరాటాన్ని మరిచి ఈ విషయాన్ని ఎత్తిచూపించడం మాత్రం సిగ్గుచేటుగా అనిపిస్తోంది’’ అని స్మిత్ అన్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ కూడా స్మిత్‌కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్‌లో స్మిత్ క్రీజు వద్దకు వెళ్లి అతడే బ్యాటింగ్ చేస్తున్నట్లు గార్డ్‌ మార్క్‌ను మార్చుకుంటాడని తెలిపాడు. అతడిది దురుద్దేశమైతే టీమిండియా ఫిర్యాదు చేసేది కదా అని అన్నాడు. కాగా, సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా గొప్పగా పోరాడి...

స్టీవ్ స్మిత్ కథలో మరో మలుపు

Image
గత రెండు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ గురించే వార్తలు! డ్రింక్స్‌ బ్రేక్‌లో రిషభ్‌ పంత్ గార్డ్‌ మార్క్‌ను వక్రబుద్ధితో చెరిపివేశాడని అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. బాల్‌టాంపరింగ్‌తో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైనా ఇంకా మారలేదని నెట్టింట్లో పోస్ట్‌లు పోటెత్తాయి. సెహ్వాగ్‌, మైకేల్ వాన్ మాజీలు కూడా స్మిత్‌ తప్పు చేశాడని విమర్శించారు. కానీ తానెలాంటి తప్పు చేయలేదని స్మిత్‌ ఎంత చెప్పినా, ఆస్ట్రేలియా జట్టు అతడిని వెనకేసుకొచ్చినా..దుర్బుద్ధితోనే స్మిత్‌ చేశాడనే అనుమానం ఎంతో మందిలో అలానే ఉంది. అయితే ఈ వివాదానికి సంబంధించిన మరో వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దాన్ని చూసిన తర్వాత స్మిత్‌ది దురుద్దేశం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు వైరల్‌ అయిన వీడియోలో.. స్మిత్ క్రీజు వద్దకు వచ్చి పంత్ గార్డ్‌ మార్క్‌ను చెరిపివేస్తున్నది మాత్రమే కనిపించింది. కానీ తాజా వీడియోలో అసలు దాని కంటే ముందు ఏం జరిగిందనే విషయం వెల్లడైంది. డ్రింక్స్‌ బ్రేక్‌లో మైదాన సిబ్బంది పిచ్‌ను శుభ్రం చేయడానికి వచ్చారు. బ్రష్‌తో క్రీజును శుభ్రం చేశారు. ఆ తర్వాత పెయిం...

గావస్కర్‌ ఏమైనా అనుకోని.. పర్లేదు: టిమ్‌పైన్‌

Image
బ్రిస్బేన్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్‌ గావస్కర్‌ చేసిన వ్యాఖ్యలు తనని ఏమాత్రం ప్రభావితం చేయవని, తన గురించి ఏమైనా అనుకోవచ్చని ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌పైన్‌ అన్నాడు. మూడో టెస్టు చివరి రోజు భారత బ్యాట్స్‌మెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(39*), హనుమ విహారి(21*) బ్యాటింగ్‌ చేస్తుండగా, పైన్‌ స్లెడ్జింగ్‌కు‌ పాల్పడిన సంగతి తెలిసిందే. అశ్విన్‌ను అతడు దూషించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో అదే రోజు గావస్కర్‌ స్పందించాడు. ఆసీస్‌ కెప్టెన్‌గా పైన్‌ రోజులు దగ్గరపడ్డాయన్నాడు. ఈ మ్యాచ్‌లో పైన్‌ ప్రవర్తన బాగోలేదని, కొన్ని క్యాచ్‌లు కూడా వదిలేశాడని గావస్కర్‌ విమర్శించాడు. కాగా, బ్రిస్బేన్‌ టెస్టు ముందు మీడియా సమావేశంలో ఓ విలేకరి ఇదే విషయాన్ని టిమ్‌పైన్‌తో ప్రస్తావించాడు. ‘గావస్కర్‌ మాటలు విన్నారా’ అని అడిగాడు. దానికి ఆస్ట్రేలియా కెప్టెన్‌.. ‘సన్నీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. అవి నాపై ప్రభావం చూపవు. కాబట్టి ఆయన ఏం అనాలనుకున్నా అనుకోవచ్చు. దాంతో నేను చేసేదేం లేదు. నా కెరీర్‌ మొత్తం మంచి ప్రదర్శన చేశాను. కానీ, సిడ్నీ టెస్టులో అలా జరిగిపోయింది’ అని బదులిచ్చాడు. అయితే, ఈ వివాదాన్ని కొనసా...

ఆసీస్‌ బౌలర్ల భుజాలు నొప్పెట్టేలా..!

Image
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి(23*; 161 బంతుల్లో 4x4) ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున అత్యంత నెమ్మదైన ఇన్నింగ్స్‌ ఆడిన ఆటగాడిగా నిలిచాడు. సోమవారం రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా విహారి 112 బంతుల్లో కేవలం 7 పరుగులే చేశాడు. దీంతో అప్పటికి అతడి స్ట్రైక్‌రేట్‌ 6.25గా నమోదైంది. అంతకుముందు 1980/81 సీజన్‌లో యశ్పాల్‌ శర్మ ఆస్ట్రేలియా గడ్డపైనే 157 బంతుల్లో 13 పరుగులే చేశాడు. ఆ మ్యాచ్‌లో యశ్పాల్‌ కూడా 112 బంతులాడాక 7 పరుగులే చేయడం గమనార్హం. దీంతో 40 ఏళ్ల తర్వాత విహారి ఆ అరుదైన రికార్డును అందుకున్నాడు.  రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా సోమవారం 407 పరుగుల భారీ లక్ష్య ఛేదనను కొనసాగించగా ఆదిలోనే రహానె(4) వికెట్‌ కోల్పోయింది. అనంతరం పంత్‌(97), పుజారా(77) కీలక ఇన్నింగ్స్‌ ఆడి టీమ్‌ఇండియా విజయంపై ఆశలు రేకెత్తించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ నాలుగో వికెట్‌కు 148 పరుగులు జోడించారు. అయితే, శతకానికి చేరువైన పంత్‌.. లైయన్‌ బౌలింగ్‌లో కమిన్స్‌ చేతికి చిక్కగా.. కొద్దిసేపటికే పుజారా సైతం హేజిల్‌వుడ్‌ బౌలి...

క్రికెటెప్పుడూ వివక్ష చూపదు: సచిన్‌

Image
ముంబయి: ఆటలనేవి అందర్నీ కలుపుతాయని, మనుషుల్ని విడదీయవని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వరుసగా రెండు రోజుల్లో రెండు సార్లు జాత్యహంకార వ్యాఖ్యలకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు టీమ్‌ఇండియా మాజీ ఆటగాళ్లు స్పందించారు. జాతి వివక్ష అంశాల పట్ల కఠినంగా ఉండాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే సచిన్‌ గతరాత్రి సామాజిక మాధ్యమాల్లో స్పందించాడు.  క్రికెట్‌ అనేది ఎప్పుడూ వివక్ష చూపదని చెప్పాడు. ఇది కేవలం.. బ్యాట్‌, బంతి పట్టుకున్న ఆటగాళ్ల ప్రతిభ మాత్రమే చూస్తుందని తెలిపాడు. ఇందులో ఆటగాళ్ల జాతి, రంగు, మతంతో సంబంధం లేదన్నాడు. ఈ విషయం అర్థం చేసుకోని వారికి క్రీడా రంగంలో కొనసాగే అర్హత లేదని అసహనం వ్యక్తం చేశాడు. అంతకుముందు సెహ్వాగ్‌ సైతం ఇలాగే స్పందించాడు. ‘మీరు చేస్తే వెటకారం, ఇతరులు చేస్తే జాతి వివక్ష. సిడ్నీ టెస్టులో పలువురు ఆస్ట్రేలియా ప్రేక్షకులు చేసింది దురదృష్టకరం’ అని ట్వీట్‌ చేశాడు.  అలాగే వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందిస్తూ తాను కూడా ఆస్ట్రేలియాలో ఆడేటప్పుడు చ...

విహారి, అశ్విన్‌ కాపాడారు..

Image
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడిన మూడో టెస్టును భారత్‌ డ్రాగా ముగించింది. 407 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా చివరికి 334/5 స్కోర్‌ సాధించింది. హనుమ విహారి(23*; 161 బంతుల్లో 4x4), రవిచంద్రన్‌ అశ్విన్‌(39*; 128 బంతుల్లో 7x4) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. వీరిద్దరూ చివరివరకు క్రీజులో పాతుకుపోయి ఆసీస్‌ విజయాన్ని అడ్డుకున్నారు. సోమవారం 98/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ మరో 3 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. దీంతో ఫలితం తేలుతుందని భావించిన సిడ్నీ టెస్టు‌ డ్రాగా ముగిసింది. ఆశలు రేకెత్తించిన పంత్‌, పుజారా..  చివరి రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే కెప్టెన్‌ అజింక్య రహానె(4) విఫలమయ్యాడు. దీంతో భారత్‌ 102 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అనంతరం జోడీ కట్టిన పుజారా(77; 205 బంతుల్లో 12x4), పంత్‌(97; 118 బంతుల్లో 12x4, 3x6) తొలి సెషన్‌లో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవైపు పంత్‌ ధాటిగా ఆడగా, మరోవైపు పుజారా డిఫెన్స్‌ చేశాడు. అలా వీరిద్దరూ ఆసీస్‌...

కమిన్స్‌ బౌలింగ్‌లో వణికిపోతున్న పుజారా

Image
చెతేశ్వర్‌ పుజారా.. టీమ్‌ఇండియా నయావాల్‌! అతడు క్రీజులో నిలిచాడంటే ప్రత్యర్థులకు చుక్కలే. బౌలర్ల సహనానికి పరీక్షే. ఇంకా చెప్పాలంటే మైదానంలోని ఫీల్డర్లు కదలకున్నా సరే అలసిపోతారు. మానసికంగా డస్సిపోతారు. పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తున్నప్పుడు అతడు వందల కొద్దీ బంతులు ఆడి పదుల కొద్దీ పరుగులు చేస్తాడు. ఒక్కసారి బంతి పాతబడిందో మెల్లగా వేగం పెంచుతాడు. అర్ధశతకాలను శతకాలుగా.. శతకాలను ద్విశతకాలుగా మలుస్తుంటాడు. గత పర్యటనలో ఇదే పనిచేసి విజయవంతమైన పుజారా ఈసారి మాత్రం విఫలమవుతున్నాడు. ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అతడిని డీకోడ్‌ చేసినట్టే కనిపిస్తున్నాడు. గత ఆసీస్‌ పర్యటనలో పరుగుల వరద పారించాడు పుజారా. 4 మ్యాచుల్లో 7 ఇన్నింగ్సుల్లో 74.43 సగటు, 41.41 స్ట్రైక్‌రేట్‌తో 521 పరుగులు చేశాడు. టోర్నీలో పరుగుల రారాజుగా అవతరించాడు. అడిలైడ్‌లో టెస్టులో అతడు 123 (246 బంతుల్లో); 71 (204 బంతుల్లో)తో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు విఫలమైన తరుణంలో దుర్భేధ్యమైన డిఫెన్స్‌తో ఆసీస్‌ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. వారి ఓపికను నశింపజేసి శతకంతో రాణించాడు. జట్టుకు విజయం అందించాడు. ఓటమి పాలైన ...

టీమ్‌ఇండియా: ఒక శుభవార్త..ఒక చేదు వార్త

Image
టీమ్ఇండియాకు ఒక శుభవార్త.. ఒక చేదువార్త! ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అతడి ఎడమచేతి బొటనవేలు పక్కకు తిరగడంతో, ఎముక విరిగిందని పేర్కొన్నారు. బ్యాటింగ్‌ గ్లోవ్స్‌ తొడుక్కోవడమూ కష్టమేనని వెల్లడించారు. కాగా యువ వికెట్‌కీపర్‌ రిషభ్ పంత్‌ మాత్రం మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తాడని తెలిపారు. ఆతిథ్య జట్టు పేసర్లు విసిరిన షార్ట్‌పిచ్ ‌బంతులకు వీరిద్దరూ గాయపడగా స్కానింగ్‌ చేయించిన సంగతి తెలిసిందే. ‘రవీంద్ర జడేజా ఎడమ బొటనవేలు పక్కకు వంగడంతో ఎముక విరిగిపోయింది. అతడు గ్లోవ్స్‌ వేసుకొని బ్యాటింగ్‌ చేయడం కష్టం. అతడు రెండుమూడు వారాలు క్రికెట్‌ ఆడలేడు. అంటే నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండడు. పంత్‌ మాత్రం బ్యాటింగ్‌ చేయగలడు. అతడి గాయం అంత తీవ్రమైందేమీ కాదు’ అని బీసీసీఐలోని ఓ అధికారి పీటీఐకి తెలిపారు. తొలి ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసిన జడ్డూ గ్లోవ్స్‌ను మిచెల్‌ స్టార్క్‌ విసిరి న బంతి తాకింది. దాంతో అతడిని స్కానింగ్‌కు పంపించారు. రిషభ్ పంత్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా అతడి ఎడమ మోచేతికి కమిన్స్‌ విసిరిన బౌన్...

ఐసీసీ సీరియస్‌.. క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా

Image
సిడ్నీ మైదానంలో ఆటగాళ్లకు జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురవ్వడం ఇదేమి కొత్త కాదని, గతంలోనూ పలుసార్లు జరిగాయని టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ తెలిపాడు. భారత ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని దూషించే వారిపై ఉక్కు పిడికిలి బిగించాలని అన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో యువ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌కు మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ అవాంఛనీయ సంఘటనపై నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం అశ్విన్‌ మీడియాతో మాట్లాడాడు. అలాంటి సంఘటనలు తమని ‘నిరాశ’కు గురిచేశాయని చెప్పడం చాలా చిన్న మాట అవుతుందని అన్నాడు. ‘‘నేను ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఇది నాలుగోసారి. ముఖ్యంగా సిడ్నీ వేదికగా గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. బౌండరీలైన్‌ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఎంతో మంది ఆటగాళ్లు వీక్షకుల వల్ల ఇబ్బందికి గురయ్యారు. ప్లేయర్లని కవ్వించేవారు, దూషించేవారు. దానికి ప్రతిచర్యగా కొందరు ఆటగాళ్లు కూడా సమాధానమిచ్చారు. అయితే ఈసారి కొందరు ప్రేక్షకులు హద్దులు దాటి జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని అశ్విన్‌ తెలిపాడు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉక్కు పిడికిలి బిగించాలి...

రౌడీల్లా ప్రవర్తించారు: కోహ్లీ

Image
ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిడ్నీ టెస్టులో హైదరాబాదీ యువపేసర్ మహ్మద్‌ సిరాజ్‌కు ఎదురైన అవాంఛనీయ సంఘటనను టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తీవ్రంగా ఖండించాడు. ప్రేక్షకులు రౌడీల్లా ప్రవర్తించారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. నాలుగో రోజు ఆటలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్‌ను ఉద్దేశించి కొందరు ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఆటలోనూ సిరాజ్‌, బుమ్రాకు ఇలాంటి సంఘటనే ఎదురవ్వడం గమనార్హం. ‘‘జాత్యహంకారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించకూడదు. బౌండరీ లైన్‌ వద్ద జరిగిన ఎన్నో దయనీయ సంఘటనల్లో ఇది అత్యంత గూండాగిరి ప్రవర్తన. మైదానంలో ఇలాంటి పరిస్థితుల్ని చూడటం చాలా బాధగా ఉంది. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు. 2011-12 ఆస్ట్రేలియా పర్యటనలో తనని ఇబ్బంది పెట్టిన ప్రేక్షకులకు కోహ్లీ వేలు చూపించిన విషయం తెలిసిందే. సిరాజ్‌కు ఎదురైన సంఘటనపై టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ కూడా‌ స్పందించాడు. ‘‘ఆస్ట్రేలియాలో...

అది నిజమైతే..జడ్డూ సూపరో సూపర్‌!

Image
సూపర్‌ఫామ్‌లో ఉన్న రవీంద్ర జడేజాను గాయాలు వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అతడికి తొడకండరాలు పట్టేశాయి. అయినా వేగంగా కోలుకుని రెండో టెస్టులో బరిలోకి దిగాడు. అంతేగాక విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. కానీ, సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మరోసారి గాయపడ్డాడు. శనివారం ఆటలో స్టార్క్‌ విసిరిన బంతికి అతడి బొటనవేలు విరిగింది. దీంతో ఆస్ట్రేలియాతో జరగనున్న ఆఖరి టెస్టుతో పాటు స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టులకు దూరమవుతున్నట్లు బీసీసీఐ వర్గాలు ఆదివారం తెలిపాయి. అయితే సిడ్నీ టెస్టులో టీమిండియాపై ఆస్ట్రేలియా పైచేయి సాధిస్తోంది. భారత్ విజయం సాధించాలంటే రేపటి ఆటలో ఆసీస్‌ బౌలర్లను 90 ఓవర్లు ఎదుర్కొని 309 పరుగులు చేయాలి. ఇప్పటికే ఓపెనర్లు రోహిత్, గిల్ పెవిలియన్‌కు చేరారు. పంత్‌ గాయం నుంచి కోలుకున్నా పూర్తి ఫిట్‌నెస్‌ ఉన్నాడో లేదో తెలియన పరిస్థితి. మరోవైపు జడ్డూ మైదానంలోకి రాలేని స్థితిలో ఉన్నాడు. దీంతో ఆసీస్‌ ఫేవరేట్‌గా భావిస్తున్నారు. కాగా, భారత జట్టును ఓటమి నుంచి తప్పించాల్సిన పరిస్థితి వస్తే జడేజా విరిగిన వేలుతోనే బరిలోకి దిగుతాడని బీసీసీఐ వర్గాలు త...

టీమ్‌ఇండియా గెలవాలంటే 309 కొట్టాలి

Image
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్‌ఇండియా గెలవాలంటే సోమవారం చివరి రోజు 309 పరుగులు చెయ్యాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(9), రహానె(4) ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 (తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 94 కలిపి) పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓపెనర్లు.. రోహిత్‌ శర్మ(52; 98 బంతుల్లో 5x4, 1x6), శుభ్‌మన్‌గిల్‌(31; 64 బంతుల్లో 4x4) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే హేజిల్‌వుడ్‌ వేసిన 23వ ఓవర్‌లో గిల్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై పుజారాతో కలిసి బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ అర్ధశతకం సాధించాడు. 30వ ఓవర్‌లో లైయన్‌ బౌలింగ్‌లో బౌండరీ బాదిన హిట్‌మ్యాన్‌ విదేశాల్లో టెస్టు ఓపెనర్‌గా తొలి అర్ధశతకం నమోదు చేశాడు. ఇక తర్వాతి ఓవర్‌లోనే కమిన్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్‌ వద్ద స్టార్క్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అప్పటికి స్కోర్‌ 92/2గా న...

నోటికి పనిచెప్పిన లబుషేన్.. రోహిత్, శుభ్‌మన్‌లను విసిగించిన ఆసీస్ బ్యాట్స్‌మన్

Image
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇక్కడికి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో మూడో టెస్టు జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్సింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ బ్యాటింగ్‌కు దిగింది.  టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ నోటికి పనిచెప్పాడు. వారి ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. అదే పనిగా వారిని విసిగించాడు. తొలుత నీకు ఇష్టమైన ఆటగాడు ఎవరంటూ గిల్‌ను ప్రశ్నించాడు. స్పందించిన గిల్.. తర్వాత చెబుతానంటూ సమాధానం చెప్పాడు. అయినా తగ్గని లబుషేన్.. ఈ బంతి ఆడిన తర్వాత చెబువాతా? అని రెట్టించాడు. అక్కడితో ఆగక, సచిన్ అంటే ఇష్టమా? లేక, విరాట్‌ అంటే ఇష్టమా? అని రెట్టించాడు. అయితే, అతడి మాటలను పట్టించుకోకుండా గిల్ బ్యాటింగ్‌లో మునిగిపోయాడు.  ఆ తర్వాత రోహిత్ వంతు వచ్చింది. రోహిత్ స్ట్రైకింగ్‌కు వచ్చినప్పుడు లుబషేన్ మళ్లీ మొదలుపెట్టాడు. ‘క్వారంటైన్‌లో ఏం చేశావేంటి?’’ ...

సచిన్, కోహ్లీ రికార్డును బద్దలుగొట్టిన స్మిత్

Image
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన స్మిత్ ఈమ్యాచ్‌లో కసితో ఆడాడు. మొత్తం 226 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 16 ఫోర్లతో 131 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ సెంచరీతో స్మిత్ ఘనమైన రికార్డును తన ఖాతాలో వేసుకోవడంతోపాటు సచిన్, కోహ్లీ రికార్డులను బద్దలుగొట్టాడు.  టెస్టుల్లో స్మిత్‌కు ఇది 27వ సెంచరీ కాగా, అన్నే శతకాలు నమోదు చేసిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సరసన చేరాడు. అంతేకాకుండా, అత్యంత వేగంగా ఈ మైలు రాయిని చేరుకున్న రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ 136 ఇన్సింగ్స్‌లలో 27 శతకాలు నమోదు చేయగా సచిన్, కోహ్లీ 141 ఇన్సింగ్స్‌లలో ఈ ఘనత అందుకున్నారు. ఇక, ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ సర్ డాన్ బ్రాడ్‌మన్ ఈ విషయంలో అందరికంటే ముందున్నాడు. కేవలం 70 ఇన్సింగ్స్‌లలోనే 27 సెంచరీలు బాదాడు. కాగా, పరుగుల విషయంలోనూ స్మిత్.. కోహ్లీని దాటేశాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు స్మిత్ 7,368 పరుగులు చేయగా, కోహ్లీ 7,318 పరుగులతో ఉన్నాడు. 

జడ్డూ నాలుగు కాదు ఐదు వికెట్లు

Image
టీమ్‌ ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి ఏదో ఒక రూపంలో ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. అలానే బాక్సింగ్‌ డే టెస్టులో అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో రాణించి జట్టు విజయంలో తన వంతు సాయం చేశాడు.  ఈ నేపథ్యంలోనే తానెంత విలువైన ఆటగాడో సిడ్నీ టెస్టులో మరోసారి నిరూపించుకున్నాడు. గురువారం 166/2 స్కోర్‌తో ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా శుక్రవారం ఇంకెన్ని పరుగులు చేస్తుందోనని ఆందోళన చెందిన వేళ జడేజా ఆదుకున్నాడు. 18 ఓవర్లు బౌలింగ్ చేసి 3 మెయిడిన్లు, 62 పరుగులతో 4 వికెట్లు తీశాడు. చివర్లో శతక వీరుడు స్టీవ్‌స్మిత్‌(131)ను సైతం రనౌట్‌ చేసి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌కు తెరదించాడు.  అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోవడంతో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని స్మిత్‌ భావించాడు. ఈ క్రమంలోనే ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, బుమ్రా వేసిన 106వ ఓవర్‌లో స్క్వేర్‌ లెగ్‌ పాయింట్‌లో షాట్‌ ఆడగా అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న జడ్డూ ...

ఒలింపిక్స్‌లో టీ10 క్రికెట్‌ బెస్ట్‌

Image
ఒలింపిక్స్‌ క్రీడల్లో టీ10 ఫార్మాట్‌ క్రికెట్‌ను చేరిస్తే బాగుంటుందని వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌ అంటున్నాడు. అమెరికాలోనూ ఈ ఫార్మాట్‌కు ప్రోత్సాహం లభిస్తుందని అంచనా వేశాడు. మంచి లాభాలు సైతం వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. అబుదాబి వేదికగా త్వరలో జరిగే టీ10 క్రికెట్ టోర్నీలో అబుదాబి జట్టుకు క్రిస్‌గేల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జమైకాలోని తన ఇంటి నుంచి అతడు మీడియాతో మాట్లాడాడు. ‘ప్రస్తుతం నాకు అవసరమైనంత విశ్రాంతి లభిస్తోంది. అబుదాబిలో టీ10 లీగును దృష్టిలో పెట్టుకొని త్వరలో సాధన ఆరంభిస్తాను. క్రికెట్‌లో పునరాగమనం చేస్తాను. మా జట్టులో అద్భుతమైన అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. కీరన్‌ పొలార్డ్‌, క్రిస్‌ మోరిస్‌ వంటి ఆటగాళ్లు ఉన్నారు. గతంలో వారితో కలిసి ఆడాను. వారిని మళ్లీ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని గేల్‌ అన్నాడు. టీ10 ఫార్మాట్‌ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. ‘ఒలింపిక్స్‌లో టీ10 క్రికెట్‌ను చూడాలనుకుంటున్నా. ఏ రకంగా చూసినా ఇది క్రికెట్‌కు గొప్పదనమే. టీ10కు అమెరికాలోనూ మంచి భవిష్యత్తు ఉంటుంది. అక్కడ క్రికెట్‌కు ఎక్కువ క్రేజ్‌ లేదు. అందుకే ఈ ఫార్మాట్‌ అక్...

ఆసీస్‌పై 100 సిక్సర్లు బాదిన ఒకేఒక్కడు

Image
టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్‌గా అవతరించాడు. ఆ జట్టుపై మరెవ్వరికీ లేని ఘనత సొంతం చేసుకున్నాడు. కెరీర్లో 424వ సిక్సర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ 77 బంతుల్లో 1 సిక్సర్‌, 3 బౌండరీల సాయంతో 26 పరుగులు చేశాడు. నేథన్‌ లైయన్‌ వేసిన 16వ ఓవర్లో అద్భుతమైన సిక్సర్ బాదాడు. క్రీజును దాటి చక్కని ఫుట్‌వర్క్‌తో బంతిని బౌండరీ ఆవలకు పంపించి ఆసీస్‌పై 100 సిక్సర్ల రికార్డు అందుకున్నాడు. ఒక జట్టుపై అన్ని ఫార్మాట్లలో కలిపి ఎక్కువ సిక్సర్లు బాదిన వారిలో క్రిస్‌గేల్‌దే అగ్రస్థానం. అతడు ఇంగ్లాండ్‌పై ఏకంగా 140 సిక్సర్లు దంచేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్‌ 424వ సిక్స్ బాదేశాడు. క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదినవారి జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. క్రిస్‌గేల్‌ (534), షాహిద్‌ అఫ్రిది (476) అతడి కన్నా ముందున్నారు. అయితే ఇందుకోసం వీళ్లు 500కు పైగా ఇన్నింగ్స్‌లు ఆడారు. హిట్‌మ్యాన్‌ మాత్రం 370 ఇన్నింగ్సుల్లోనే ...

బ్రిస్బేన్‌లో లాక్‌డౌన్‌.. నాలుగో టెస్టు జరిగేనా?

Image
బ్రిస్బేన్‌లో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. క్వీన్స్‌లాండ్‌ ప్రభుత్వం తాజాగా మూడు రోజుల లాక్‌డౌన్‌ విధించడమే అందుకు కారణం. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 15 నుంచి 19 వరకు బ్రిస్బేన్‌లోని గబ్బాలో నాలుగో టెస్టు జరగాలి. అయితే కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా అక్కడి ప్రభుత్వం కఠినమైన క్వారంటైన్‌ నిబంధనల్ని అమలు చేస్తోంది. మరోసారి కఠిన క్వారంటైన్‌ నిబంధనల్ని పాటించడం సాధ్యంకాదని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు బీసీసీఐ తేల్చిచెప్పింది. నిబంధనలు సడలించకపోతే బ్రిస్బేన్‌కు వెళ్లమని స్పష్టంచేసింది. ఈ వ్యవహారంపై బీసీసీఐ, సీఏల మధ్య చర్చలు ప్రారంభమైన 24 గంటల్లోనే అక్కడి ప్రభుత్వం మూడు రోజుల లాక్‌డౌన్‌ విధించడం క్రికెట్‌ ఆస్ట్రేలియాను మరింత సందిగ్ధంలోకి నెట్టింది. ‘‘బ్రిస్బేన్‌ టెస్టుపై మూడు రోజుల లాక్‌డౌన్‌ ప్రభావంపై సీఏ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇప్పటికే కఠినమైన బయో భద్రత ఆంక్షల నేపథ్యంలో బ్రిస్బేన్‌కు వెళ్లేందుకు టీమ్‌ఇండియా ఆసక్తి చూపించట్లేదు. హోటల్‌ సిబ్బందిలో ఒకరికి యూకే స్ట్రెయిన్‌ కొవిడ్‌ సోకిందన్న సమాచారం.. టెస్టు మ్యాచ్‌ను గబ్బాలోనే న...

డేవిడ్‌ వార్నర్‌ నాలుగేళ్లలో ఇలా తొలిసారి

Image
టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కంటతడి పెట్టాడు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన అతడు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు ప్రారంభం సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యాడు. సీనియర్ పేసర్‌ మహ్మద్‌ షమి తొలి టెస్టులో గాయపడగా సిరాజ్‌ రెండో టెస్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె ఆ మ్యాచ్‌కు ముందు టెస్టు క్యాప్‌ అందజేసి అరంగేట్రం చేయించాడు. ఈ క్రమంలోనే ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన సిరాజ్‌  జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే మూడో టెస్టులో అవకాశం రావడంతో గురువారం మ్యాచ్‌ ప్రారంభమైన సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యాడు. సిడ్నీలో మ్యాచ్‌ ఆరంభానికి ముందు జాతీయ గీతం ఆలపించిన సమయంలో ఈ హైదరాబాద్‌ పేసర్‌ భావోద్వేగం చెందాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు. రెండు చేతులతో ఆ కన్నీటిని తుడుచుకుంటూ కనిపించాడు. అదంతా మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారంలో కనిపించడంతో అభిమానులు సైతం విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక మ్యాచ్‌ ఆరంభమైన కొద్దిసేపటికే సిరాజ్‌ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆస్ట్...

జాతీయ గీతం ఆలపిస్తూ సిరాజ్‌ కంటతడి..

Image
టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కంటతడి పెట్టాడు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన అతడు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు ప్రారంభం సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యాడు. సీనియర్ పేసర్‌ మహ్మద్‌ షమి తొలి టెస్టులో గాయపడగా సిరాజ్‌ రెండో టెస్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె ఆ మ్యాచ్‌కు ముందు టెస్టు క్యాప్‌ అందజేసి అరంగేట్రం చేయించాడు. ఈ క్రమంలోనే ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన సిరాజ్‌  జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే మూడో టెస్టులో అవకాశం రావడంతో గురువారం మ్యాచ్‌ ప్రారంభమైన సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యాడు. సిడ్నీలో మ్యాచ్‌ ఆరంభానికి ముందు జాతీయ గీతం ఆలపించిన సమయంలో ఈ హైదరాబాద్‌ పేసర్‌ భావోద్వేగం చెందాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు. రెండు చేతులతో ఆ కన్నీటిని తుడుచుకుంటూ కనిపించాడు. అదంతా మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారంలో కనిపించడంతో అభిమానులు సైతం విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక మ్యాచ్‌ ఆరంభమైన కొద్దిసేపటికే సిరాజ్‌ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆస్ట్...

ఆంక్షలు సడలిస్తేనే నాలుగో టెస్టు.. లేదంటే!

Image
బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు ఆడాలంటే టీమ్‌ఇండియా క్రికెటర్లకు కఠిన క్వారంటైన్‌ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాకు బీసీసీఐ అధికారికంగా లేఖ రాసింది. ఆస్ట్రేలియాకు వచ్చేముందు భారత జట్టు రెండు నగరాల్లో కఠిన క్వారంటైన్‌ అయ్యేందుకు ఒప్పందం చేసుకోలేదని తెలిపింది. దుబాయ్‌ నుంచి రాగానే సిడ్నీలో ఆటగాళ్లు ఐసోలేషన్‌కు వెళ్లారని గుర్తుచేసింది. పర్యటనకు ముందు చేసుకున్న ఒప్పందంలోని అంశాలను బీసీసీఐ అత్యున్నత అధికారి సీఏ అధినేత ఎర్ల్‌ ఎడింగ్స్‌ దృష్టికి తీసుకొచ్చారు. సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత టీమ్‌ఇండియా గబ్బా వేదికగా నాలుగో టెస్టు ఆడాల్సి ఉంది. జనవరి 15న ఇది ఆరంభమవుతుంది. అయితే బ్రిస్బేన్‌ నగరానికి చేరుకున్న వెంటనే ఆటగాళ్లంతా హోటల్‌ గదులకు మాత్రమే పరిమితం అవ్వాలని అక్కడి నిబంధనలు చెబుతున్నాయి. ఇలాంటి వాతావరణానికి క్రికెటర్లు ససేమిరా అంటున్నారు. ‘చర్చలు జరుగుతున్నాయి. బ్రిస్బేన్‌లో మ్యాచ్‌ కావాలంటే కఠిన క్వారంటైన్‌ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని బీసీసీఐ అధికారికంగా నేడు లేఖరాసింది. పర్యటనకు ముందు చేసుకున్న ఒప్పందంలో రెండు కఠిన క్వారంటైన్‌లు లేవు. సిడ్నీలో టీమ్ఇండియా ఒక కఠిన క్వా...

నాన్న గుర్తొచ్చే.. సిరాజ్‌ కంటతడి

Image
జాతీయగీతం ఆలపించేటప్పుడు నాన్న గుర్తొచ్చాడని టీమ్‌ఇండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. అందుకే కాస్త భావోద్వేగానికి గురయ్యానని తెలిపాడు. తాను దేశం తరఫున టెస్టు క్రికెట్‌ ఆడాలన్నది నాన్న కలని  పేర్కొన్నాడు. ‘ఇప్పుడు నాన్న నన్ను చూస్తున్నారనే అనుకుంటున్నా’ అని వెల్లడించాడు. మూడో టెస్టు తొలిరోజు తర్వాత సిరాజ్‌ మీడియాతో మాట్లాడాడు. నవంబర్లో సిరాజ్‌ తండ్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. కరోనా ఆంక్షలు, దేశం తరఫున ఆడాలన్న తండ్రి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో సిరాజ్‌ నగరానికి రాలేకపోయాడు. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనలేదు. కాగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో అరంగేట్రం చేసిన సిరాజ్‌ చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. సమయోచితంగా వికెట్లు తీసి జట్టుకు అండగా నిలుస్తున్నాడు. సిడ్నీ టెస్టులోనూ ఆసీస్‌ తొలి వికెట్‌ను సిరాజే అందించాడు. ప్రమాదకర డేవిడ్‌ వార్నర్‌ను పెవిలియన్‌ పంపించాడు. సిడ్నీ పిచ్‌ బ్యాటర్లకు స్వర్గధామంగా ఉందని, స్పిన్నర్లకూ అనుకూలిస్తుందని సిరాజ్‌ అంటున్నాడు. ‘ఇది ఫ్లాట్‌ వికెట్‌. పరుగులు చేయడం సులభం కాబట్టి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాలన్నదే మా ప్రణాళిక. గత మ్యాచుల్లో మాదిరి...

రూ.7 కోట్ల క్రికెటర్‌ను వదిలేయనున్న CSK

Image
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంచైజీ 2021 సీజన్‌ కోసం భారీ కసరత్తు మొదలు పెట్టింది. రానున్న సీజన్లో యువకులపై పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తన ఘన వారసత్వాన్ని చాటాలన్న దృఢ సంకల్పంతో ఉందని తెలిసింది. ఎంఎస్‌ ధోనీ నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు చేస్తోందని సమాచారం. ఇందులో భాగంగానే సీనియర్‌ ఆటగాడు కేదార్‌ జాదవ్‌ను వదిలేస్తోందని అభిజ్ఞవర్గాలు అంటున్నాయి. ఒకప్పుడు బంతి, బ్యాటుతో టీమ్‌ఇండియాకు అండగా నిలిచిన ఈ ఆల్‌రౌండర్‌ మూడేళ్లుగా రాణించడం లేదు. వరుసగా గాయాల పాలవుతున్నాడు. జట్టులో అవకాశం ఇచ్చినా దూకుడుగా ఆడలేకపోతున్నాడు. 2018లో చెన్నై రూ.7.8 కోట్లు వెచ్చించి వేలంలో అతడిని కొనుగోలు చేసింది. అప్పట్నుంచి అతడి ప్రదర్శన జట్టుకు ఏమాత్రం సాయపడలేదు. 2020లో అతడి ఆటతీరు మరీ తీసికట్టుగా మారింది. ఎనిమిది మ్యాచులాడి 62 పరుగులే చేశాడు. విశ్లేషకుల నుంచి అభిమానుల వరకు అతడిని తెగ విమర్శించారు. జాదవ్‌తో పాటు మరికొందరి భారాన్ని తొలగించుకొనేందుకు చెన్నై సిద్ధమైందని సమాచారం. ‘ఐపీఎల్‌-2020లో జాదవ్‌ అత్యుత్తమ ఫామ్‌లో లేడు. ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. 2021లో సీఎస్‌కే అ...

మారని పంత్ తీరు

Image
బ్యాటింగ్‌ పిచ్‌పై బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. చేజారిన క్యాచ్‌లు సిడ్నీ టెస్టులో భారత్‌ను కష్టాల్లోకి నెట్టేలా ఉన్నాయి. తొలి టెస్టులో ఫీల్డింగ్‌లో ఘోర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్న టీమ్‌ఇండియా.. రెండో టెస్టులో ఆ సమస్య అధిగమించి మంచి ఫలితాన్ని రాబట్టింది. అయితే మూడో టెస్టులో మరోసారి ఫీల్డింగ్‌ పొరపాట్లు భారత జట్టును దెబ్బతీశాయి. ముఖ్యంగా రిషబ్‌ పంత్‌. గ్లోవ్స్‌తో అతడి తడబాటు కొనసాగుతూనే ఉంది. అతడు సరిగా కీపింగ్‌ చేసి ఉంటే తొలి రోజు టీమ్‌ ఇండియా పరిస్థితి భిన్నంగా ఉండేదే! అరంగేట్ర బ్యాట్స్‌మన్‌ పకోస్కీ ఇచ్చిన క్యాచ్‌లను పంత్‌ రెండు సార్లు వదిలేశాడు. మొదట 22వ ఓవర్లో అతడు పకోస్కీకి జీవనదానమిచ్చాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో పకోస్కీ డ్రైవ్‌ చేయబోగా బంతి ఎడ్జ్‌ తీసుకోని నేరుగా పంత్‌ చేతుల్లోకి వెళ్లింది. కానీ లడ్డూ లాంటి క్యాచ్‌ను అతడు ఒడిసి పట్టలేకపోయాడు. అప్పటికి పకోస్కీ స్కోరు 26 మాత్రమే. పకోస్కీ మరో ఆరు పరుగులు జోడించాక మరోసారి ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. ఈసారీ దాత పంతే. బౌలర్‌ సిరాజ్‌. షార్ట్‌ బంతిని పకోస్కీ పుల్‌ షాట్‌ ఆడబోగా.. అది అతడి గ్లోవ్స్‌ను తాకుతూ పం...

రోహిత్ శతకంతోనే తిరిగొస్తాడు

Image
దాదాపు ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ శతకంతో రీఎంట్రీ ఇస్తాడని దిగ్గజ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న సిడ్నీ టెస్టులో అతడు సత్తాచాటుతాడని పేర్కొన్నాడు. మయాంక్ అగర్వాల్‌ విఫలమవుతుండటంతో హిట్‌మ్యాన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని అభిప్రాయపడ్డాడు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లో రోహిత్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఐపీఎల్ ఆడినప్పటికీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ‘‘విరాట్ కోహ్లీ గైర్హాజరీలో సీనియర్‌ ఆటగాడు రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరడంపై టీమిండియా ఎంతో సంతోషిస్తుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో మరింత అనుభవం కావాలి. ఎందుకంటే సిడ్నీలో విజయం సాధించి సిరీస్‌ను 2-1తో లేదా 3-1తో ముగించే అవకాశాలు భారత్‌కు ఉన్నాయి. రోహిత్‌ తన ప్రతిభను చూపించాలనుకుంటున్నాడు. అతడి బ్యాటింగ్ స్టైల్‌కు ఆస్ట్రేలియా పిచ్‌లు ఎంతో నప్పుతాయి. అతడు కొత్తబంతిని సమర్థవంతంగా ఎదుర్కొంటే భారీ శతకం కచ్చితంగా సాధిస్తాడు’’ అని లక్ష్మణ్‌ తెలిపాడు. తొలి టెస్టులో ఘోరపరాజయం అనంతరం అద్భుత...

కోహ్లీ, పాండ్య ఆంక్షల ఉల్లంఘన అబద్ధం

Image
టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ ‌పాండ్య కొవిడ్‌-19 ఆంక్షలను ఉల్లంఘించడం శుద్ధ అబద్ధమని సిడ్నీలోని బేబీ స్టోర్‌ యజమాని నేథన్‌ పొంగ్రాస్‌ తెలిపారు. ఆస్ట్రేలియాలోని ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. స్టోర్‌కు వచ్చిన వారిద్దరికీ బహుమతులు ఇవ్వాలనుకున్నా వాటికి వారు డబ్బులు చెల్లించారని వెల్లడించారు. తమ ఉద్యోగుల కోరిక మేరకు ఎంతో ఓపికగా ఫొటోలు దిగారని ప్రశంసించారు. వారిద్దరినీ అసలు స్పర్శించనివ్వలేదని స్పష్టం చేశారు. వారు స్టోర్‌కు వచ్చినప్పుడు ఆంక్షలే లేవని నొక్కిచెప్పడం గమనార్హం. సిడ్నీలో ఉండగా కోహ్లీ, పాండ్య కలిసి ఓ బేబీస్టోర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వారు మాస్కుల్లేకుండా చిత్రాలు దిగారు. డిసెంబర్‌ 7న వారు స్టోర్‌కు వెళితే దాదాపుగా 20 రోజులు తర్వాత ఆ చిత్రాలు వైరల్‌గా మారాయి. దాంతో వారు కొవిడ్‌-19 ఆంక్షలు, బయో బుడగ నిబంధనలు ఉల్లంఘించారని ఆసీస్‌ మీడియా ప్రచారం చేసింది. అంతకుముందే రోహిత్‌ సహా ఐదుగురు హోటల్‌కు వెళ్లిన వీడియోలను చూపించి దుష్ప్రచారం చేసింది. ఆ తర్వాత గబ్బాలో నాలుగో టెస్టు బహిష్కరణ, బీసీసీఐ ఆగ...

బాక్సింగ్‌ డే టెస్టుకు హాజరైన అభిమానికి కరోనా

Image
మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన భారత్‌×ఆస్ట్రేలియా రెండో టెస్టుకు హాజరైన ఓ అభిమానికి కరోనా పాజిటివ్‌గా‌ తేలింది. దీంతో అప్రమత్తమైన మెల్‌బోర్న్‌ ప్రభుత్వ యంత్రాంగం బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు గ్రేట్ సౌథర్న్‌ స్టాండ్‌లో కూర్చున్న ప్రేక్షకులను ఐసోలేషన్‌లో ఉండాలని సూచించింది. మ్యాచ్‌కు హాజరైన సమయంలో ఆ సదరు వ్యక్తికి కొవిడ్‌-19 సోకలేదని, ఆ తర్వాత మహమ్మారి బారిన పడ్డాడని వెల్లడించింది. కానీ, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా టెస్టులో నెగెటివ్‌ వచ్చేవరకు ఐసోలేషన్‌లోనే ఉండాలని తెలిపింది. ‘‘డిసెంబర్‌ 27న గ్రేట్‌ సౌథర్న్‌ స్టాండ్‌లోని జోన్-5లో మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 గంటల సమయంలో కూర్చున్న వీక్షకులు కరోనా టెస్టు చేయించుకోవాలి. నెగెటివ్ వచ్చే వరకు ఐసోలేషన్‌లో ఉండాలి. అయితే బాక్సింగ్‌ డే టెస్టుకు హాజరైన సమయంలో ఆ సదరు వ్యక్తికి కరోనా సోకలేదు. ఆ తర్వాత అతడు మహమ్మరి బారిన పడ్డాడు. అయినప్పటికీ వైద్యశాఖ సూచనల మేరకు కొవిడ్‌ టెస్టులో నెగెటివ్ వచ్చేవరకు ఐసోలేషన్‌లోనే ఉండాలి. బాక్సింగ్‌ డే టెస్టులో ఆట ముగిసిన తర్వాత ప్రతిసారి మైదాన సిబ్బంది స్టేడియాన్ని శానిటైజ్‌ చేశారు’’ అని మె...

టీమిండియా చెప్పిందంటే కంగారు పడాల్సిందే

Image
నాలుగో టెస్టు ఆడేందుకు టీమిండియా సముఖంగా లేదని వార్తలు వచ్చినప్పుడు కంగారు పడ్డానని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌ పైన్‌ అన్నాడు. బ్రిస్బేన్‌లో  తుది టెస్టు ఆడటానికి టీమిండియాకు సిద్ధంగా లేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పైన్‌ స్పందిస్తూ... ‘‘కొన్ని విషయాలు ఉత్కంఠకు దారితీశాయి. దీంతో టెస్టు కొనసాగడం ఉత్కంఠ నెలకొంది. అయితే, టీమిండియా సముఖంగా లేదని, నాలుగో టెస్టు ఆడటంపై స్పష్టత రాలేదని, భారత బృందంలో కొందరు పేర్కొన్నట్లు.. తెలియడంతో ఆందోళనకు గురయ్యా. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత శక్తివంతమైన టీమిండియా నుంచి అలాంటి విషయాలు విన్నప్పుడు అవి జరుగుతాయేమో అనిపిస్తుంది’’ అని పైన్‌ వర్చువల్‌ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ‘‘మేం ప్రస్తుతం మూడో టెస్టు గురించే ఆలోచిస్తాం. నిబంధనలపై మాకు అవగాహన ఉంది. ఈ వారం ఆటపైనే దృష్టిసారిస్తాం. వచ్చే వారం గురించి తర్వాత ఆలోచిస్తాం. అదే వేదికపై జరగాలని మేం కోరుకోవట్లేదు. ముంబయిలో మ్యాచ్‌ జరిగినా దానికి తగ్గట్లుగా సన్నద్ధమై బరిలోకి దిగుతాం. ఎంతో కాలం తర్వాత టెస్టు క్రికెట్‌ ఆడుతున్నందుకు ఇరు జట్లు సంతోషంగా ఉన్నాయి’’ అని పైన్‌ పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లు బయ...

సిడ్నీ టెస్టుకు జట్టును ప్రకటించిన భారత్‌

Image
సిడ్నీ వేదికగా రేపు ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు తుదిజట్టును భారత్ ప్రకటించింది. దాదాపు ఏడాది తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. గత మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన మయాంక్‌ అగర్వాల్‌ బెంచ్‌కు పరిమితమయ్యాడు. మరోవైపు గాయంతో ఉమేశ్ యాదవ్‌ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో యువపేసర్‌ నవదీప్‌ సైని జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌తో సైని టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్,ఆసీస్ చెరో విజయంతో 1-1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. జట్టు వివరాలు అజింక్య రహానె (కెప్టెన్‌), రోహిత్ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్ సైని

వర్షం పడటంవల్లే రెస్టారెంట్ లోకి వెళ్లారు

Image
భారత్ క్రికెటర్లు మెలో బోర్న్ రెస్టారెంట్ లో న్యూ ఇయర్ డిన్నర్ రగడ కొత్త మలుపులు తిరుగుతోంది. భారత్ క్రికెటర్లను క్వారంటైన్ కు పంపటంపై గుర్రుగా ఉంది BCCI. తాజాగా ఈ ఘటనపై బోర్డు అధికారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బయట వర్షం పడటం వల్లే ఆటగాళ్లు రెస్టారెంట్ లోకి వెళ్లారని చెప్పారు. అదే సమయంలో 3వ టెస్టుకు ముందు జట్టు స్థిర్యం దెబ్బతీసేందుకు ఆసీస్ ప్రయత్నిస్తే.. ఇది తప్పుడు సంకేతమని మండిపడ్డారు.

మెస్సీ ఖాతాలో మరో రికార్డు

Image
బార్సిలోనా క్లబ్ తరఫున 750 మ్యాచ్ లు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా అర్జెంటీనా ఫుట్ బాలర్ లియోనల్ మెస్సీ ఘనత సాధించాడు. ఇతడి కంటే ముందు 767 మ్యాచ్ లతో జావీ (స్పెయిన్) ఉన్నాడు. యాజమాన్యంతో విభేదాలతో మెస్సీ గతేడాది బార్సిలోనాకు దూరం కావాలని అనుకున్నాడు. కానీ కాంట్రాక్టు ప్రకారం అతడు 2021 వరకు తమతోనే ఉండాలని.. లేదంటే రూ.6,103 కోట్లు చెల్లించాలని క్లబ్ చెప్పడంతో ఈ ఏడాది అదే జట్టుకు మెస్సీ ఆడుతున్నాడు.

రోహిత్ శర్మ ఎలా ఆడతాడో ?

Image
జనవరి 7న ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టులో అందరి దృష్టి రోహిత్ శర్మపైనే ఉంది. IPL తర్వాత హిట్ మ్యాన్ ఆడే తొలి మ్యాచ్ ఇదే. గాయంతో తొలుత ఆసీస్ వెళ్లని రోహిత్.. బెంగళూరు NCAలో చెమటోడ్చాడు. ఫిట్నెస్ నిరూపించుకుని AUS ఫ్లైట్ ఎక్కాడు. సిడ్నీలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత హోటల్ లో బీఫ్ వివాదం రోహిత్ ను చుట్టుముట్టింది. మరోవైపు భారీ అంచనాలు. వీటన్నింటి మధ్య హిట్ మ్యాన్ ఎలా ఆడతాడో చూడాలి.

రోహిత్ ను ఔట్ చేయడం పెద్ద సవాల్

Image
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను ఔట్ చేయడం తమ బౌలర్లకు పెద్ద సవాలని AUS స్పిన్నర్ నాథన్ లియోన్ అభిప్రాయపడ్డాడు. అతన్ని ఔట్ చేసేందుకు తాము పకడ్బందీ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని చెప్పాడు. 'ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మె లో రోహిత్ ఒకడు. అతని రాకతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలోపేతమైంది. రోహిత్ ను ఎవరు ఔట్ చేస్తారో చూడాలి. వీలైనంత త్వరగా అతన్ని వెనక్కి పంపాలని భావిస్తున్నాం' అని లియోన్ తెలిపాడు.

సవాళ్లకు సిద్ధం అంటున్న నట్టూ

Image
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20ల్లో అదరగొట్టిన నటరాజన్ టెస్టుల్లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. భారత జెర్సీ ధరించనుండటం ఎంతో గర్వకారణం కొత్త సవాళ్లకు రెడీగా ఉన్నా' అని భారత జెర్సీతో దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు. టీ20లు, వన్డేలు, టెస్టులు ఈ మూడు ఫార్మాట్లలోనూ నటరాజన్ కు విభిన్న పరిస్థితుల్లో చోటు దక్కింది. వరుణ చక్రవర్తి గాయంతో టీ20లకు, సైనీ గాయంతో వన్డేలకు, ఉమేశ్ కు గాయంతో టెస్టులకు ఎంపికయ్యాడు.

తాండ్రయ్యాక కేన్ మామా విశ్వరూపం

Image
టెస్టుల్లో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ జోరు కొనసాగుతోంది. పాకిస్తాన్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ క్లాస్ బ్యాట్స్ మన్ డబుల్ సెంచరీ చేశాడు తండ్రయ్యాక రెండు డబుల్ సెంచరీలు, ఓ సెంచరీ చేశాడు. 2018 నుంచి టెస్టుల్లో కేన్ ఒక్కడే 3 డబుల్ సెంచరీలు చేయగా టీమిండియా 4, ఆస్ట్రేలియా 3 డబుల్ సెంచరీలు సాధించాయి.

ఆస్పత్రిలో దాదా.. అడ్వర్టైజ్ మెంట్ల తొలగింపు

Image
BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో.. అదానీ విల్మర్ సంస్థ తమ ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంటనూనె అడ్వర్టైజ్ మెంట్లను నిలిపివేసింది. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన దాదా, గుండె ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని దీన్ని ప్రమోట్ చేశారు. సౌరవ్ అదే సమస్యతో ఆస్పత్రిలో చేరిన తరుణంలో ఈ వంటనూనెపై విమర్శలు వెల్లువెత్తాయి వెంటనే ప్రకటనలు ప్లాట్‌ఫాంల నుంచి తొలగించింది సదరు సంస్థ.

టీమిండియాకు బిగ్ షాక్

Image
AUSతో మూడో టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో స్టార్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు శనివారం ప్రాక్టీస్లో అతని ఎడమ చేతి మణికట్టుకు గాయమైందని, పూర్తిగా కోలుకునేందుకు 3 వారాల సమయం పడుతుందని BCCI ప్రకటించింది. రాహుల్ ఇండియాకు వచ్చి, బెంగళూరు NCAలో ట్రైనింగ్ తీసుకుంటాడని తెలిపింది. దీంతో రాహుల్కు AUSతో ఒక్క టెస్టు కూడా ఆడే అవకాశం దక్కలేదు.

50 ఏళ్ళ క్రితం.. క్రికెట్ చరిత్రలో తొలిసారిగా

Image
తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరిగి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1971 JAN 5న ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య తొలి ODI జరిగింది. అయితే ఇది ముందుగా షెడ్యూల్ చేసిన మ్యాచ్ కాదు. ఇరు జట్ల మధ్య అప్పుడు టెస్ట్ సిరీస్ నడుస్తోంది. మూడో టెస్టులో తొలి 3 రోజులు వర్షార్పణం కాగా.. అభిమానులను నిరాశపర్చకుండా 40ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్ణయించింది. టాస్ తో పాటు మ్యాచ్ నూ కంగారూలు గెలిచారు .